దేవులపల్లి కృష్ణశాస్త్రి |
"ఇది మల్లెల వేళ" చక్కని భావుకతను వ్యక్త పరిచే మధుర గీతం. అలాటి పాటలు వ్రాయడం శ్రీ దేవులపల్లి వారికే చెల్లు. ఏ అమ్మాయికైనా తన భవిష్యత్తును తీర్చి దిద్దుకునే విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం. తొందరపడి వేసిన అడుగు వలన ఇబ్బందుల పాలవచ్చు. ఈ నేపధ్యంలో ఎందరినో ప్రభావితం చేసే పాత్రలో వాణిశ్రీ నటించిన ఈ చిత్రం కోసం ఆ భావాన్ని, ఆ సందర్భాన్ని ప్రతిబింబించేలా దేవులపల్లి వారు వ్రాసిన పాట "ఇది మల్లెల వేళయని". ఇది ఆ రోజుల్లో శ్రీమతి సుశీల గారి సూపర్ హిట్ పాట. ఆ రోజులలో ఎక్కడ పాటల పోటీలు జరిగినా ఈ పాట ఎవరో ఒకరు పాడి బహుమతి కొట్టేసేవారు. ఈ పాటలో శాస్త్రి గారు "మొగసాల" అనే చక్కని పదం వాడారు. "మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కింది" అనే సామెతలో వాడటం వింటాం ఈ పదం. "మొగసాల" లేదా "ముఖసాల" అంటే "తలవాకిలి" అని అర్ధం.
చిత్రం: సుఖ దుఃఖాలు (1967)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
గానం: పి.సుశీల
ఓ.. ఓ.. ఓ.. ఓ..
ప. ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమని
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది
చ. కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కోయిల ఎగిరింది | ఎరుగని |
చిరిగిన రెక్కల ఒరిగింది నేలకు ఒరిగింది | ఇది మల్లెల |
చ. మరిగిపోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం | మరిగిపోయేది |
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం
వసివాడని కుసుమ విలాసం | ఇది మల్లెల |
చ. ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం | ద్వారానికి |
మోసం, ద్వేషం లేని సీమలో | మోసం ద్వేషం |
మొగసాల నిలిచెనీ మందారం | ఇది మల్లెల |
ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఈ బ్లాగు కూడా మీదేనా..బావుందండీ..మంచి పాట గుర్తు చేశారు..
రిప్లయితొలగించండి