3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు

గంగా శంతనుల అష్టమ పుత్రుడైన దేవవ్రతుడు (గాంగేయుడు) తండ్రి మనోరథం చెల్లించడానికి ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని భీషణ శపథం చేసి భీష్ముడుగా వాసికెక్కాడు. అందుకు ప్రతిగా తండ్రి నుండి స్వచ్చంద మరణం కలిగేలా వరం పొందుతాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని చేత గాయపడి, అది దక్షిణాయనం అవడం వలన ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చేవరకు పార్థుడు అమర్చిన అంపశయ్యపై విశ్రమించి, తనను జిజ్ఞాసతో సమీపించిన ధర్మజునికి శ్రీ విష్ణు సహస్రనామం వినిపించి, ఏకాదశి శుభదినాన తుది శ్వాస విడుస్తాడు శాంతనవుడు. అదే భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. భీష్ముడు తన సవతి తమ్ముల కోసం కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను జయించి తీసుకుని వస్తాడు. అయితే అంబ అంతకు మునుపే సాళ్వ రాజును వరించినదని తెలుసుకుని ఆమెను ఆమె ప్రియునివద్దకు పంపేస్తాడు భీష్ముడు. అయితే భీష్ముడు గెలుచుకున్న అంబను చేపట్టనని సాల్వుడు అనగా, అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చి తనను పరిగ్రహించమంటుంది. అందుకు నిరాకరించిన భీష్ముని గెలిచే వరంకోసం అంబ పరమ శివుని గురించి తపస్సు చేస్తుంది. అంబ శివుని ప్రార్థించే పాట "మహాదేవ శంభో" పి.సుశీల గళంలో వినండి. అంబగా అంజలీదేవి నటించింది. 

చిత్రం:      భీష్మ (1962)
రచన:      ఆరుద్ర
గానం:      పి. సుశీల
సంగీతం:  సాలూరు రాజేశ్వర రావు

మహాదేవ శంభో..ఓ..ఓ..  మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించ రావా                 | మహా దేవ |

జటాజూట ధారీ శివా చంద్రమౌళి నిటాలాక్ష నీవే సదా నాకు రక్షా        | జటాజూట |
ప్రతీకార శక్తి ప్రసాదించ రావా  ప్రసన్నమ్ము కావా! ప్రసన్నమ్ము కావా!
మహాదేవ శంభో..ఓ..ఓ.. మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా  మొరాలించి పాలించ రావా 
మహా దేవ శంభో..
శివోహం శివోహం శివోహం శివోహం  
మహాదేవ శంభో..ఓ..ఓ.. మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించ రావా
మహా దేవ శంభో..
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం

1 కామెంట్‌:

Blog Indices