17, ఏప్రిల్ 2012, మంగళవారం

పిల్లలు మెచ్చే 'భక్త ప్రహ్లాద' చిత్రం నుండి పోతన భాగవత పద్యాలు

1967 లో విడుదలైన భక్త ప్రహ్లాద చిత్రం పిల్లలు మెచ్చే భక్తి రస ప్రధాన చిత్రం. ఇందులో ప్రహ్లాదునిగా అలనాటి బాలనటి రోజారమణి నటన అపూర్వం. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపునిగా ఎస్.వి.రంగారావు, తల్లి లీలావతిగా అంజలీదేవి, నారదునిగా మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, ప్రహ్లాదుని గురువులుగా శ్రీ రేలంగి, పద్మనాభం గార్లు నటించారు. ఈ చిత్రంలోని పద్యాలన్నీ బమ్మెఱ పోతనామాత్యులు రచించిన శ్రీ మదాంధ్ర భాగవతం నందలి ప్రహ్లాద చరిత్ర లోనివి. వీనిని గానం చేసినది శ్రీమతి పి.సుశీల గారు. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు.





పద్యం: కరుణ లేని మనసు కఠిన పాషాణంబు 


జాలి గలుగు వాడె సజ్జనుండు 


సాధు జంతువులను బాధింప వలదయ్యా


ప్రాణి హింస ఘోర పాపమయ్యా!..ఆ..ఆ..





పద్యం: చదివించిరి నను గురువులు 


చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే


చదివినవి గలవు పెక్కులు 


చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!





పద్యం: తెల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలన్‌ 


ద్రెల్లక వీరునేమను మతి భ్రమణంబున ఖిన్నులై ప్రవ 


ర్తిల్లక సర్వమున్‌ అతని దివ్య కళామయమంచు విష్ణునం


దుల్లము జేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ..





పద్యం: కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మ భస్త్రి గాక 


వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక


హరి పూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక..


కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక 





పద్యం: చక్రి చింతలేని జన్మంబు జన్మమే? 


తరళ సలిల బుద్బుదంబు గాక 


విష్ణు భక్తిలేని విబుధుండు విబుధుడే?


పాద యుగముతోడి పశువు గాక





పద్యం: మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు వోవునే మదనములకు 


నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు  


లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు 


పూర్ణేంద్రు చంద్రికా స్పురిత చకోరకంబు అఱుగునే సాంద్ర నీహారములకు 





పద్యం: అంబుజోదర దివ్య పాదారవింద  


చింతనామృత పాన విశేష మత్త చిత్తము


ఏ రీతి యితరంబు జేరనేర్చు 


వినుత గుణశీల మాటలు వేయునేల ఆ..ఆ..ఆ..ఆ..





పద్యం: వలయుతులకు, దుర్బలులకు 


బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్‌


బలమెవ్వడు పాణులకును బలమెవ్వండూ.. అట్టి విభుడు 


బలము అసురేంద్రా..ఆ..ఆ..





పద్యం: కలడంబోధి గాలి కలడాకాశంబునన్‌ కుంభినిన్‌


కలడగ్నిన్‌, దిశలన్‌, పగళ్ళ నిశలన్‌ ఖద్యోత చంద్రాత్మలన్‌ 


కలడోంకారమునన్‌, త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్‌ దంతటన్‌


కలడీశుండు కలండు తండ్రీ వెదకంగానేల ఈ యా యెడన్‌..





పద్యం: ఇందుగలడందు లేడని


సందేహము వలదు చక్రి సర్వోపగతుండు


ఎందెందు వెదకి చూచిన 


అందండే గలడు దానవాగ్రణి వింటే…

6 కామెంట్‌లు:

Blog Indices