21, మార్చి 2012, బుధవారం

ఏ దివిలో విరిసిన పారిజాతమో - కన్నె వయసు నుండి

1973 లో విడుదలైన విలక్షణమైన చిత్రం కన్నె వయసు. ఇందులోని డాక్టర్ పద్మశ్రీ ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" చాల చక్కని గీతం. ప్రేమ బీజాలు నాటిన యువ కవి హృదయంలో కలిగిన స్పందన కవితగా మారి తన ప్రేయసిని తలచుకుని పాడిన పాట ఇది. ఈ పాట ఆరోజుల్లో ఎన్ని పాటల పోటీలలో పాడబడిందో చెప్పలేము. దీన్ని బాలు తన లేత గొంతుతో చాల గొప్పగా పాడారు. ఈ పాట రచించినది శ్రీ దాశరథి గారు, సంగీతం సమకూర్చినది శ్రీ చెళ్ళపిళ్ళ సత్యం గారు. ఈయన మరెవరో కాదు తిరుపతి వేంకట కవులలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటకవి గారికి మునిమనుమడు.  ఈ లలిత-శృంగార గీతాన్ని సినిమాలో హీరో లక్ష్మీకాంత్ పై చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో కథానాయిక రోజారమణి మరియు హీరో స్నేహితుడు కూడ ఉన్నారు. రోజారమణి కుమారుడే సినీ హీరో తరుణ్. ఇదే పాటను ఈ చిత్రంలో శ్రీమతి ఎస్.జానకి గారు కూడ ఏకగళ గీతంగా పాడారు.



ప.   ఏ దివిలో విరిసిన పారిజాతమో
     ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో
     నా మదిలో నీవై నిండిపోయెనే
     ఏ దివిలో విరిసిన పారిజాతమో
     ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

అ.ప. నీ రూపమే దివ్యదీపమై, నీ నవ్వులే నవ్యతారలై
     నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే
     ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో 

చ.   పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగ రావే
     నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
     కాలి అందియలు ఘల్లుఘల్లుమన రజహంసలా రావే
     ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

చ.   నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
     బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే
     పదము పదములో మధువులూరగ కావ్యకన్యవై రావే
     ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

2 కామెంట్‌లు:

Blog Indices