10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

తెలుగువారింట పెళ్ళి జరిగితే ఈ పాట తప్పనిసరిగా వినిపించవలసిందే!

తెలుగు వారి ఇండ్లలో పెళ్ళిళ్ళు జరిగినపుడు ఖచ్చితంగా వినిపించే పాట "సీతారాముల కళ్యాణము చూతము రారండి".  ఈ పాట విననిదీ, భజంత్రీల వాళ్ళు మాంగల్య ధారణ సమయంలో వాయించనిదీ పెళ్లి జరిగినట్లు అనిపించదు. అంతటి చక్కని బాణీ, చక్కని రచన ఈ పాటది. ఇది 1961 లో విడుదలైన, ఎన్.టి.రామారావు గారు రావణుడుగా నటించి, దర్సకత్వం వహించిన "సీతారామ కల్యాణం" చిత్రం కోసం శ్రీ సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) వ్రాయగా, అలనాటి మేటి సంగీత దర్శకులు శ్రీ గాలి పెంచల నరసింహారావు మధ్యమావతి రాగంలో కట్టిన బాణీ ఇది. వీరి ఇంటి పేరు గాలి, మిగిలిన పేరు పెంచల నరసింహారావు. అయితే చాలామంది "గాలిపెంచల" అని వ్రాతలలోనూ, మాటల లోను పేర్కొనడం వలన ఆయన గాలిపెంచల నరసింహారావు అయారు.  పెళ్ళిళ్ళలో, సంప్రదాయాలలో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి.   పెళ్లి అలంకారాలలో వాడే పదాలు, చిహ్నాలు - మణి బాసికము, కళ్యాణపు బొట్టు, పారాణి, తలంబ్రాలు, కస్తూరి నామము మొదలయినవి ఇన్నేళ్ళయినా మరచిపోకుండా ఉండాలంటే ఈ పాట వింటే సరి. అంత చక్కగా పదికాలాలు నిలిచి పోయేలా పాడారు శ్రీమతి పి.సుశీల. ఇక్కడ వున్న యూ ట్యూబ్ వీడియోలోనూ, సినిమా డివిడి లోను మూడు చరణాలు మాత్రమె వున్నాయి. కాని నిజానికి ఇది ఆరు చరణాల పాట. పాట సంపూర్ణంగా ఆడియో ఫైలులో వినవచ్చును. 

వీడియోలో మూడు చరణాలే వున్నాయి
 
ఆరు చరణాల పూర్తి పాట ఆడియో ఫైలు

సముద్రాల (సీ)             గాలిపెంచల           పి.సుశీల



గానం:     పి.సుశీల   
        
    

            పల్లవి:   
కోరస్:   సీతారాముల కళ్యాణము చూతము రారండి
           శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
            చరణం-1:
సుశీల:  చూచువారలకు చూడ ముచ్చటట, పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
కోరస్:   చూచువారలకు చూడ ముచ్చటట, పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
సుశీల:  భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  భక్తి యుక్తులకు ముక్తిప్రదమట, సురలను మునులను చూడవచ్చురట
కోరస్:   కళ్యాణము చూతము రారండి
            చరణం-2:
సుశీల:  దుర్జన కోటిని దర్పమడంచగ, సజ్జన కోటిని సంరక్షింపగ
కోరస్:   దుర్జన కోటిని దర్పమడంచగ, సజ్జన కోటిని సంరక్షింపగ
సుశీల:  ధారుణి శాంతిని స్థాపన చేయగ
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  ధారుణి శాంతిని స్థాపన చేయగ, నరుడై పుట్టిన పురుషోత్తముని
కోరస్:   కళ్యాణము చూతము రారండి
            చరణం-3:
సుశీల:  దశరథ రాజు సుతుడై వెలసి, కౌశికు యాగము రక్షణ జేసి
కోరస్:   దశరథ రాజు సుతుడై వెలసి, కౌశికు యాగము రక్షణ జేసి
సుశీల:  జనకుని సభలో హరువిల్లు విరచి
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  జనకుని సభలో హరువిల్లు విరచి, జానకి మనసు గెలిచిన రాముని
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
           చరణం-4:
సుశీల:  విరి కళ్యాణపు బొట్టును బెట్టి
కోరస్:   బొట్టును బెట్టి
సుశీల:  మణి బాసికమును నుదుటను గట్టి
కోరస్:   నుదుటను గట్టి
సుశీల:  పారాణిని పాదాలకు బెట్టి
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  పారాణిని పాదాలకు బెట్టి, పెళ్ళి కూతురై వెలసిన సీతా
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
           చరణం-5:
సుశీల:  సంపగి నూనెను కురులను దువ్వి
కోరస్:   కురులను దువ్వి
సుశీల:  సొంపుగ కస్తూరి నామము తీర్చి
కోరస్:   నామము తీర్చి
సుశీల:  చెంపగ వాసి చుక్కను బెట్టి
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  చెంపగ వాసి చుక్కను బెట్టి, పెండ్లి కొడుకై వెలసిన రాముని
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
             చరణం-6:
సుశీల:  జానకి దోసిట కెంపుల ప్రోవై
కోరస్:   కెంపుల ప్రోవై
సుశీల:  రాముని దోసిట నీలపు రాశై
కోరస్:   నీలపు రాశై
సుశీల:  ఆణిముత్యములు తలంబ్రాలుగా
కోరస్:   ఆ...అ.ఆ..ఆ...  అ.ఆ..ఆ..  అ.ఆ..అ..ఆ
సుశీల:  ఆణిముత్యములు తలంబ్రాలుగా, శిరముల మెరసిన సీతారాముల
కోరస్:   కళ్యాణము చూతము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి

8 కామెంట్‌లు:

  1. గురువు గారు ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం అండి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు. కాకతాళీయంగా నేను కూడ అదే పాట పోస్ట్ చేసాను. చేసిన తరువాత చూసా. మీరు కూడ పోస్ట్ చేసారని. ఇది కాంపిటీషన్ కాదు సుమండీ.

      తొలగించండి
    2. గురువు గారు నేను పోస్ట్ చూశాక తెలిసింది నేను సగం సాంగ్ మింగేశాను అని.. నేను యు ట్యూబ్ నుంచి సాంగ్ రాశాను.. ధన్యవాదములు అండి..

      తొలగించండి
    3. అది మీ తప్పుకాదండి. యూ ట్యూబ్ లో వున్న సినిమాలో కూడ మూడు చరణాలే వున్నాయి. ఒరిగినల్ గా ఇది ఆరు చరణాల పాట. DVD లు చేసేవారు కూడ సినిమా ఒక చక్రంలో పట్టించడానికి కొంత భాగం మింగేస్తుంటారు. ఆవిధంగా ఒక్కోసారి చాల మంచి పాటలు కూడ తొలగింపబడుతున్నాయి. మీ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. మీరూ తెలుగు పాటలు గారూ ఈ రోజు ఒకే పాట పెట్టారే...
    >>జానకి దోసిట కెంపుల ప్రోవై
    రాముని దోసిట నీలపు రాశై
    ఆణిముత్యములు తలంబ్రాలుగా>>
    ఈ చరణం బావుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జ్యోతిర్మయి గారు, అది కాకతాళీయంగా జరిగింది. అయితే ఒరిజినల్ పాటలో ఆరు చరణాలున్నాయి. అవి ఆడియో ఫైలు లో వినవచ్చును. ఎందుకో మొదటి మూడు చరణాలు సినిమాలో పెట్టలేదు. మీ స్పందనకు ధన్యవాదాలు. మంచి క్వాలిటీ వీడియో ఉంటే బాగుండును. మీరు చెప్పిన చరణం నాకు కూడ యిష్టం.

      తొలగించండి

Blog Indices