29, మార్చి 2012, గురువారం

విధాత తలపున - సిరివెన్నెల నుండి

1986 లో విడుదలైన చిత్రం కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన "సిరివెన్నెల". సంగీతం ఆధారంగా గ్రుడ్డి వాడైన హీరో, మూగదైన హీరోయిన్‌ తో చిత్రం నిర్మించడం ఒక సాహసం. అన్ని రసాలు కలిగి ఇది ఒక కళాఖండంగా రూపొందింది. ఈ చిత్రం ద్వారా పాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీ చేంబోలు సీతారామ శాస్త్రి గారు తెలుగు వారికి ఒక వరం. ఈ చిత్రం పేరు అతని యింటిపేరుగా మారి ఆయనే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయ్యారు.  ఇపుడందరికీ ఆయన సిరివెన్నెల.  తొలిచిత్రంలో వ్రాసిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకు 'మామ' మహదేవన్‌ గారి చక్కని బాణీలు కూడ కారణం.  అంతేకాక ప్రముఖ వేణు విద్వాంసులు శ్రీ హరిప్రసాద్ చౌరాసియా గారు తన వేణుగానాన్ని అందించి ఈ చిత్రానికి జీవం పోసారు. ఈ చిత్రంలోని విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం" పాట ప్రణవ నాదమైన  ఓంకారాన్నిఆలంబనగా వ్రాసిన గీతం.  ఇంత అద్భుతమైన రచన చేసి నంది పురస్కారం పొందిన శ్రీ సిరివెన్నెల గారికి జోహార్లు. శ్రీ సిరివెన్నెల గారికి "మా టీవి" వారు ఇటీవల అఖండ సన్మానం చేశారు.  

సాకీ:          విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓం..
                ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం...
                కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
                ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ఆ......ఆ.....
అ.ప.         సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది (2)
                నే పాడిన జీవన వేదం ఈ గీతం..
ప.             విరించినై విరచించితిని ఈ కవనం
                విపంచినై వినిపించితిని ఈ గీతం

చ:             ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన

                జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన                     | ప్రాగ్దిశ |
                పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
                విశ్వకార్యమునకిది భాష్యముగా                                            || విరించినై ||

చ:             జనించు ప్రతిశిశుగళమున పలికిన జీవననాద తరంగం

                 చేతనపొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం    | జనించు |
                 అనాది రాగం ఆదితాళమున అనంత జీవనవాహినిగా
                 సాగిన సృష్టి విలాసమునే                                                    || విరించినై ||
                 నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం (2)
                 సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది
                 నే పాడిన జీవన వేదం ఈ గీతం...

1 కామెంట్‌:

Blog Indices